
నస్పూర్, వెలుగు: సిమెంట్ ఇటుకల చాటున గంజాయి తరలిస్తున్న వ్యక్తులను శ్రీరాంపూర్ పోలీసులు అరెస్టు చేసినట్లు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చితాపరి గ్రామానికి చెందిన చిత్రాసేన్ క్రిసాని, జగబందు క్రిసాని అనే అన్నదమ్ములు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించేవారు. ఈ నెల 22న రవాణా చేస్తున్న క్రమంలో రాత్రి జీఎం ఆఫీసు దగ్గర నేషనల్ హైవే పక్కన టైరు పంక్చర్ కవడంతో ట్రాక్టర్ ను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు.
23న పెట్రోలింగ్ చేస్తున్న శ్రీరాంపూర్ ఎస్ఐ ట్రాక్టర్ వద్ద ఎవరూ లేకపోవడంతో సిబ్బందితో పోలీస్ స్టేషన్‌కు తరలించారని, వెహికల్ కోసం ఎవరూ రాకపోవడంతో అనుమానంతో 25న తనిఖీ చేయగా సిమెంట్ ఇటుకల కింద టేపు చుట్టి ఉంచిన 93(465 కిలోలు) గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. అనంతరం గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో పంచనామా నిర్వహించామన్నారు. గంజాయి విలువ రూ.93లక్షలు ఉంటుందని తెలిపారు. దీనిపై ఎంక్వైరీ చేపట్టిన శ్రీరాంపూర్ పోలీసులు ఆధారాలు సేకరించి ఒడిశాలోని వారి స్వగ్రానికి చేరుకొని ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఏసీపీ మోహన్, శ్రీరాంపూర్ సీఐ రమేశ్ బాబు, ఎస్ఐ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.