బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి సూచించారు. బుధవారం బెల్లంపల్లిలోని సింగరేణి తిలక్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, రామగుండం సీపీలతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, నియోజకవర్గ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ బి.రాహుల్ రాజ్, ఎన్నికల పరిశీలకుడు డీసీపీ సుధీర్ రామనాథ్ కేకన్, ఏసీపీ పి.సదయ్యతో కలిసి వారు పర్యవేక్షించారు.
ఈవీఎం ర్యాండమైజేషన్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది చేరుకొని ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారులతో కలిసి సమర్థంగా విధులు నిర్వహించి ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. పోలీసు బందోబస్తు మధ్య రూట్ల వారీగా సెక్టోరల్ అధికారులను, ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేరవేశారు.