‘ప్లీజ్ అలా చేయకండి’.. హైదరాబాద్ యువతకు సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక పిలుపు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బోయినపల్లిలో  రూ.8.5 కోట్ల విలువ చేసే ఎనిమిదిన్నర కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. బోయినపల్లి పల్లిలో స్థానిక పోలీసులు, హెచ్ న్యూ టీమ్స్ సోమవారం 8.5 కిలోల ఎమ్ఫిటమిన్  డ్రగ్ పట్టుకున్నారని తెలిపారు. దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని.. ఈ డ్రగ్‎ను పిల్, లిక్విడ్‎గా వివిధ రూపాల్లో తీసుకుంటారని చెప్పారు. ఎమ్ఫిటమిన్  డ్రగ్‎ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్‎లో కలిపి ఇస్తుంటారన్నారు. మార్కెట్లో ఈ డ్రగ్ ఖరీదు ఒక కేజీ.. కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కంచెర్ల నాగరాజు.. కుంతి శ్రీ శైలం, వినోద్ కుమార్‎లతో కలిసి డ్రగ్ రవాణా చేస్తున్నాడని తెలిపారు. 

Also Read:-రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

గతంలో  ఆల్ఫా జోలం సరఫరా కేసులో అరెస్ట్ అయిన అంజిరెడ్డి అనే నిందితుడి శిష్యుడే ఈ కంచెర్ల నాగరాజు అని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేశామని.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యువతకు సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి నగర యువత డ్రగ్స్ బారిన పడకండి. పార్టీలకు వెళ్లే యూత్.. తెలిసినా, తెలియని వ్యక్తులతో పార్టీలకు వెళ్ళినపుడు అప్రమత్తంగా ఉండాలి. మాదక ద్రవ్యాలను కూల్ డ్రింక్స్‎లో కలిపి ఇస్తుంటారు కాబట్టి అలెర్ట్ గా ఉండాలి. తల్లి దండ్రులు సైతం తమ పిల్లలు ఎవరితో పార్టీలకు పోతున్నారో గమనిస్తూ ఉండాలి’’ అని సూచన చేశారు.