సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కృషి చేస్తోందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. సైబర్ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని.. ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారు, మధ్య తరగతి వారే నేరాల బారిన పడుతున్నారని వివరించారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
కొరియర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు డీజీపీ రవిగుప్తా. సైబర్ నేరాలు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో ముందుగా భయాన్ని నింపి సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారని వివరించారు. మరోవైపు ఈ నేరాల్లో తెలిందేంటంటే.. యుట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యమన్నారు డీజీపీ రవిగుప్తా.
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ నేరాలపై వర్క్ షాప్ చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ రవిగుప్త పలువురు పోలీస్ ఉన్నత అధికారులు హాజరయ్యారు.