కిడ్నాపైన ఆరుగంటల్లోగా అమ్మాయిని కాపాడాం : సుధీర్ బాబు

మన్నెగూడ కిడ్నాప్ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కిడ్నాప్ అయిన ఆరు గంటల్లోగా బాధిత అమ్మాయిని రెస్క్యూ చేశామని తెలిపారు. ఇది పక్కాగా ప్లాన్ చేసిన కిడ్నాప్ అని చెప్పారు. ఆదిభట్ల పీఎస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈవివరాలను వెల్లడించారు. ప్రస్తుత బాధిత యువతి షాక్ లో ఉందని, మాట్లాడే స్థితిలో లేదని చెప్పారు. నిందితులు ఆమెను కొట్టి భయపెట్టారని సీపీ వివరించారు.  యువతిని కిడ్నాప్ చేశాడనే అభియోగాలను ఎదుర్కొంటున్న నవీన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని, అతడి కోసం పోలీస్ టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయన్నారు. దొరికిన నిందితులను ఇన్వెస్టిగేట్ చేసి, మిగతా వాళ్ళని పట్టుకుంటామని అడిషనల్ సీపీ పేర్కొన్నారు. 

అసలేం జరిగింది..? 

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఓ యువతి కిడ్నాప్ నకు గురైందనే వార్త కలకలం రేపింది. తమ కూతురుని నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వచ్చిదాడి చేసి, తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్న గూడలో ఈ ఘటన జరిగింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ కూతురిని మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి తీసుకెళ్లాడని యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 100 మందికిపైగా యువకులతో నవీన్ రెడ్డి.. తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై దాడిచేసి తమ కూతురిని బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారని తెలిపారు. అడ్డు వచ్చిన వారందరిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలోనే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ యువతిని కొంతకాలంగా నవీన్ రెడ్డి వేధిస్తున్నాడని చెబుతున్నారు. నవీన్ రెడ్డి కొంతమంది మనుషులతో తమ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న సమయంలో పోలీసులకు, 100కు కాల్ చేసినా స్పందించలేదని యువతి తల్లిదండ్రులు ఉదయం ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల ఇంట్లో పలు చోట్ల రక్తపు మరకలను గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు10 కార్లు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.