- రాచకొండ సీపీ తరుణ్ జోషి
యాదగిరిగుట్ట, వెలుగు : ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండపైన స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన.. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు
ఆలయ ఆఫీసర్లకు సూచనలు చేశారు. అనంతరం మెట్ల మార్గం, విష్ణుపుష్కరిణి, వైకుంఠ ద్వారం ప్రాంతాలను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు ఎంతమంది భక్తులు తరలివచ్చినా అందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీల తాకిడి వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యంగా ఈ నెల 18న నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల భద్రతపై యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోలీసులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేశ్ చంద్ర, ఏసీపీ రమేశ్ కుమార్, సీఐ రమేశ్, ఆలయ సూపరింటెండెంట్ రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు.