నెల్లికంటి సత్యంకు కలిసొచ్చిన బీసీవాదం!

నెల్లికంటి సత్యంకు కలిసొచ్చిన బీసీవాదం!
  • ఓసీలకు ఎమ్మెల్యే, మీడియా అకాడమీ చైర్మన్ పదవులు
  • ఎమ్మెల్సీగా బీసీకి అవకాశం ఇచ్చిన సీపీఐ

హైదరాబాద్, వెలుగు: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యంకు బీసీ వాదం కలిసొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో సీపీఐకి ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించేలా కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికలు జరుగుతుండగా.. అందులో 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. దీంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఒక సీటు సీపీఐకి కేటాయించింది. అయితే, సీపీఐలో ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది పోటీపడ్డారు. ఎవరికి పదవి ఇవ్వాలనే దానిపై పార్టీ కూడా తీవ్ర కసరత్తు చేసింది. నెల్లికంటి సత్యంతో పాటు ఓసీ వర్గానికి చెందిన చాడ వెంకట్​రెడ్డి, పల్లా వెంకట్​రెడ్డి, తక్కళపల్లి శ్రీనివాస్ రావు పోటీపడ్డారు. 

కాగా, ఇప్పటికే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కమ్మ సామాజికవర్గం, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి కూడా సీపీఐ కోటాలో కార్పొరేషన్ పదవి దక్కింది.  వీరిద్దరూ ఓసీ కావడంతో ఎమ్మెల్సీ పదవిని ఎవరికి కట్టబెట్టాలన్నదానిపై తీవ్ర చర్చ జరిగింది. చివరికి బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి వరించింది. దీంతో ఆయన సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన పార్టీ హైకమాండ్​కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.  

పార్టీ విధేయుడికి పట్టం

నల్లగొండ సీపీఐ కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్న నెల్లికంటి సత్యం యాదవ్.. సొంతూరు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎలగలగూడెం గ్రామం. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేశారు. మునుగోడు మండలంలో పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా, దివంగత మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షంతో కలిసి పని చేశారు. 1985 నుంచి 2000 వరకు ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, 2010 నుంచి 2016 వరకు సీపీఐ మునుగోడు మండల కార్యదర్శిగా, 2016 నుంచి సీపీఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శిగా, 2020 నుంచి సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు.

 2002లో అప్పటి ప్రభుత్వం రాచకొండలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమంలో సత్యం యాదవ్ కీలకపాత్ర వహించారు. ఆ తర్వాత 2005లో రాచకొండ గుట్టల్లో యురేనియం తవ్వకాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యమం నిర్వహించారు. నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.