
- సీపీఐ నేత అజీజ్ పాషా
హైదరాబాద్, వెలుగు : యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేని పాలకులను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా అన్నారు. శనివారం ఆయన హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన ఏఐవైఎఫ్ జాతీయ వర్క్‌షాప్‌లో ప్రారంభోపన్యాసం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత ఉద్యమించాలని కోరారు. దక్షిణ భారతంలో బీజేపీ గేట్‌వే మూసుకుపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేస్తూ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక ఎన్నికల్లో జై బజరంగబలి అంటూ నినాదాలు చేసినా.. ప్రజలు పట్టించుకోలేదని అజీజ్‌పాషా పేర్కొన్నారు.
అంతకుముందు ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుహేందర్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్, నాయకులు జిస్మాన్, లెనిన్ బాబు, అరుణ్, విక్కీ, హరీశ్బాల, భారతి, కరంవీర్ కౌర్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.