బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలను స్పష్టం చెయ్యాలె: చాడ వెంకటరెడ్డి

బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలను సీఎం కేసీఆర్  స్పష్టం చేయలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. పార్టీ  విధి విధానాలను బట్టి తమ నిర్ణయం ఉంటుందని చెప్పారు. సీపీఐ అవతరణ దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, కూలీలకు జరుగుతున్న అన్యాయంపై ఎవరు పోరాటం చేసినా వాళ్లతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అర్హులైన వారికి ఇండ్లు , భూమి, పెన్షన్లు అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించక ముందే, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు జెండాలు పాతి ఆక్రమించుకుని గుడిసెలు వేసుకోవాలని ఆయన కోరారు. 

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదని చాడ వెంకటరెడ్డి అన్నారు. కనీస సౌకర్యాలు విద్యా, వైద్యం అందుబాటులో లేకుండా పోయాయని ఆరోపించారు. వ్యవసాయంతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పోరేట్ వ్యవస్థకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 26న హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తామని చెప్పారు. ఈ నెల 29న బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని పేర్కొన్నారు.