హైదరాబాద్ లోని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మగ్ధుమ్ భవన్ లో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు నాయకులు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్టీ ఎన్నికల హామీ పత్రాన్ని రిలీజ్ చేశారు.
“సైనిక చర్యలను ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని మోడీ చూస్తున్నారు. శాటిలైట్ కు సంబంధించిన విషయాలు ఇస్రో విడుదల చేయాలి కానీ మోడీ ప్రకటించడం ఏంటి?” అని సురవరం ప్రశ్నించారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలనీ.. నిరుద్యోగులకు భగత్ సింగ్ జాతీయ ఉద్యోగ భద్రతను అమలు చేయాలని సురవరం డిమాండ్ చేశారు. మహిళలకు అన్ని రంగాల్లో 33%రిజర్వేషన్లు అమలు చేయాలనీ.. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలనీ కోరారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అనే అంశాన్ని ఎత్తివేయాలనీ.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసేలా కృషి జరగాలన్నారు.
తమకు అవకాశం వస్తే… సచార్ కమిటీ, రంగనాధ్ మిశ్రా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామనీ.. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడానికి సీపీఐ కట్టుబడి ఉందని చెప్పారు. కశ్మీర్ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆరోగ్యానికి జీడీపీలో 6% నిధులు కేటాయించాలని కోరారు.
సీపీఐ, సీపీఎం పార్టీలు తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయనీ… సీపీఐ మద్దతు కోసం కుంతియా సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి. ఎక్కడెక్కడ ఎవరికి మద్దతివ్వాలో అనే విషయంపై 2 రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. ఏప్రిల్ 1న భువనగిరిలో, ఏప్రిల్ 2న మహబూబాబాద్ లో భారీ సభలు నిర్వహిస్తామని చెప్పారు చాడ.