దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : డి.రాజా

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం గవర్నర్లతో ఇబ్బంది పెడుతోందని సీపీఐ నేత డి. రాజా ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తిగా మారుతున్న బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. బీజేపీ చెబుతున్నట్లు  సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడుందని ప్రశ్నించారు.  బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డ రాజా.. వన్ పార్టీ వన్ లీడర్ విధానంతో బీజేపీ ముందుకెళ్తోందని ఆరోపించారు.  మోడీ సర్కారురాష్ట్రాల సమస్యలను పట్టించుకోకుండా బడా బాబులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్న డి. రాజా కేసీఆర్ సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించారు. కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రస్తుతం కలిసి పోరాడితే తప్ప దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సెక్యూలర్ పార్టీలన్నీ కలిసి బీజేపీ నుంచి దేశానికి విముక్తి కలిగించాలని డి. రాజా పిలుపునిచ్చారు.