హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగూడెం సీటు ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని సీపీఐ నిర్ణయించింది. అదే సమయంలో మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఇది సాధ్యం కాకపోతే సీపీఎంతో కలిసి ఐదు స్థానాలు కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది. పొత్తులపై నిర్ణయం కేంద్ర కమిటీకి అప్పగిస్తూ తీర్మానించింది. శుక్రవారం మగ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఎన్నికల్లో పోటీ, కాంగ్రెస్‌తో పొత్తు, ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరిగింది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలనే అంశంపై చాలామంది వ్యతిరేకించినట్టు తెలిసింది. తొలుత సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించిందని, తర్వాత కొత్తగూడెం, చెన్నూరు ఇస్తామని చెప్పారని, తాజాగా ఏ సీట్లు ఇస్తామనేది చెప్పకుండా ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇస్తామని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సీపీఐ నేతలు సమావేశంలో పేర్కొన్నారు.
అయితే ఏ సీటు ఇస్తామనే దానిపై స్పష్టత లేదన్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం సీటు ఇస్తే పొత్తుకు ఒకే చెప్పాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే, సీపీఎం పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీకి మద్దతివ్వాలని, మిగిలిన చోట కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలని నిర్ణయించారు. పొత్తులపై శనివారం క్లారిటీ రానుందని సీపీఐ నేతలు ప్రకటించారు. భవిష్యత్‌లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని, లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయాలని సమావేశంలో తీర్మానించారు.