
జహీరాబాద్, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈద్గా ఎడ్ల బజార్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలతో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ సుభాష్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటీ నరసింహ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ సమస్యకు
పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి నరసింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, జిల్లా నాయకులు అజారుద్దీన్, ఆనంద్, మహబూబ్ ఖాన్, అశోక్, రుబీనా బేగం, చిరంజీవి, సయ్యద్ తాజుద్దీన్, నర్సింలు పాల్గొన్నారు.