ఖమ్మంలో సీపీఐ వందేండ్ల పండుగ

ఖమ్మంలో సీపీఐ వందేండ్ల పండుగ
  • వచ్చే ఏడాది డిసెంబర్ 26న భారీ ర్యాలీ, పబ్లిక్ మీటింగ్: డి.రాజా

న్యూఢిల్లీ, వెలుగు:సీపీఐ వందేండ్ల ముగింపు ఉత్సవాలను ఖమ్మంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ మేరకు సోమవారం సీపీఐ నేషనల్ జనరల్ సెక్రటరీ డి.రాజా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

గత నెల 28, 29, 30 తేదీల్లో జరిగిన పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌‌లో తీసుకున్న తీర్మానాలను వెల్లడించారు. ఇందులో భాగంగా పార్టీ వందేండ్ల సెలబ్రేషన్స్‌‌కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈ విజయోత్సవాలను ఉత్తరప్రదేశ్‌‌లోని కాన్పూర్‌‌‌‌లో ఈ నెల 26న ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే, తర్వాతి పార్టీ కాంగ్రెస్ మీటింగ్‌‌ను చండీగఢ్‌‌లో వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు నిర్వహించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. 

డిసెంబర్ 10న వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఆదానీ ముడుపుల వ్యవహారంపై పార్లమెంట్ జాయింట్ కమిటీ(జేపీసీ) వేయాలని దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్‌‌లో సమగ్ర చర్చ జరిపి, వెంటనే అక్కడ మొహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు.