సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మృతి.. మార్నింగ్‌‌ వాక్‌‌ చేస్తుండగా గుండెపోటుకు గురైన ప్రసాద్‌‌

సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మృతి.. మార్నింగ్‌‌ వాక్‌‌ చేస్తుండగా గుండెపోటుకు గురైన ప్రసాద్‌‌

ఖమ్మం టౌన్, వెలుగు : సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ (64)చనిపోయారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌‌బండ్‌‌పై ఉన్న వాక్‌‌వేలో బుధవారం ఉదయం మార్నింగ్‌‌ వాక్‌‌ చేస్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయాడు. గమనించిన పలువురు ప్రసాద్‌‌నువెంటనే ఓ ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఆయన హార్ట్‌‌స్ట్రోక్‌‌కు గురయ్యారని, హాస్పిటల్‌‌కు తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రసాద్ మృతి విషయం తెలుసుకున్న ఆయా పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉంచారు. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 29న ప్రసాద్‌‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు ఆయన డెడ్‌‌బాడీని మమత హాస్పిటల్‌‌లో భద్రపరుస్తామని చెప్పారు.

నివాళులర్పించిన ప్రముఖులు

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌‌ మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు తరలివచ్చారు. సీపీఐ సీనియర్‌‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావులు ప్రసాద్‌‌ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నాయకులు ఎస్.వీరయ్య, పి.సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, అవునూరి మధు, గుర్రం అచ్చయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, చంద్రావతి ప్రసాద్‌‌కు నివాళి అర్పించారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రేణుకా చౌదరి, వద్దిరాజు రవిచంద్ర, రఘురాంరెడ్డి, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, నాయకులు చాడ వెంకట్‌‌రెడ్డి సంతాపం తెలిపారు.