గుండెపోటుతో సీపీఐ నేత బాలమల్లేశ్ మృతి

హైదరాబాద్, వెలుగు: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ శనివారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మేడ్చల్ జిల్లా యాప్రాల్ గ్రామంలోని శ్మశానవాటికలో  జరగనున్నాయి. అంతకు ముందు అభిమానులు, సీపీఐ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం హిమాయత్ నగర్  సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ లో బాలమల్లేశ్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 

అనంతరం యాప్రాల్ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.బాల మల్లేశ్ మృతికి సీపీఐ జాతీయ, రాష్ట్ర, ప్రజా సంఘాల నాయకులు సంతాపం తెలిపారు. బాలమల్లేశ్ మృతి పార్టీకి తీరని లోటని, మంచి భవిష్యత్ ఉన్న నాయకుడిని పార్టీ కోల్పోయిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బాలమల్లేశ్ మృతికి కూనంనేని సాంబశివరావు, ఏపీ సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, రామకృష్ణ పాండా,  భాగం హేమంతరావు, పశ్యపద్మ  నివాళి అర్పించారు.  కాగా..బాలమల్లేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్య్యదర్శి నుంచి అంచెలంచెలుగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు.