బుర్ర కొండయ్య గౌడ్ తెలంగాణలో గౌడన్నలను ఐక్యం చేయడంలో 50 ఏండ్లు పైగా కృషిచేసిన మహనీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బుర్ర కొండయ్య కౌండిన్య గోత్రంలో ఋషి సమానుడు. కులం కోసం తిరగడం కూడా ఒక గొప్పేనా?. అది కూడా సమాజానికి, సమాజ మార్పుకు ఒక కంట్రిబ్యూషనేనా!. అని చాలామంది ప్రజాస్వామికవాదులమని చెప్పుకునేవారు చులకనగా మాట్లాడడం అలవాటైపోయింది. మనం చెప్పకుంటున్న బుర్ర కొండయ్య గౌడ్ మారోజు వీరన్నతోపాటు కులవర్గ చైతన్యంతోటి పోరాడాలని సంఘం కట్టినోడే. ఆయన ఇంటిపేరుతో పెద్ద నక్సలైట్ లీడర్లు ఎదిగి ఉన్నారు. పెద్దపెద్ద ఐఏఎస్ అధికారులను మనం చూస్తున్నాం. ఆయన ముంగట చాలామంది అల్పులు అన్ని రంగుల జెండాలతోటి ఎమ్మెల్యేలు అయినవాళ్లే.
తెలంగాణ మహాసభ పెట్టినా, తెలంగాణ జనసభ పెట్టినా, తెలంగాణ ఐక్యవేదిక అన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో, కేశవరావు జాదవ్ తో కలిసి నడిచినోడే. ధర్మభిక్షమన్న, దేశిని చిన్న మల్లయ్య అన్న..పెద్దలకు ఎద ఆంచి పనిచేసినోడే. కులం పిట్టగోడ కూడా కూలగొట్టనోడు.. దండకారణ్యం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటమని కలవరిస్తూ కాల్పనికతలో బతుకుతుంటుండు.
కులంని వృత్తి పేరుమీద, రాజకీయ అధికారం పేరు మీద సంఘటితం చేయడం సరిగ్గా జరిగి ఉంటే ఈ దేశంలో ఆధిపత్య కులాల ఆధిపత్యం ఇంత ఏకపక్షంగా తెలంగాణలోనూ తెలుగు నేల మీద ఉండకపోయుండు. ఆయన మా నాయన చెరుకు ఉషాగౌడ్తో కలిసి పనిచేసిండు. తెలంగాణ గౌడ మోకు దెబ్బకు ముగ్గు పోసిండు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌడులందరినీ ఐక్యం చేసి ఎన్నికల్లో తెలంగాణ సత్తా చాటిండు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు కలత చెందిండు.
చివరకు తెలంగాణ ఇంటి పార్టీ పెడితే కూడా మా వెంట కలిసి నడిచిండు. ఆయన ఒక సాధారణ వ్యక్తిత్వం. 80 ఏండ్లు పైబడిన వయసులో నవ యువకుడిగా, మిలిటెంట్‌గా పనిచేసే తత్వం.. మన తరానికి ఆయన వారసత్వాన్ని కొనసాగించమని ఆదేశిస్తోంది. మా ఇంట్లో, కరీంనగర్లో, తెలంగాణ భవన్ లో ఆయన గంటలు గంటలుగా మాతో జరిపిన చర్చలు, పంచుకున్న అనుభవాలు జీవితాంతం మమ్మల్ని వెంటాడుతూ ముందుకు నడిపిస్తాయి. బుర్ర కొండయ్య గౌడ్ మాత్రమే కాదు, సబ్బండ వర్ణాల సామాజిక శక్తుల సముచిత ప్రాతినిధ్యానికి జీవితకాలం కృషి చేసిన వాళ్లంతా మన కాలం లెజెండ్స్ లెక్క. మా నాయన 2011 మార్చి 6న చనిపోతే యాదృచ్ఛికంగా ఒకరోజు ముందు 13 ఏండ్ల తర్వాత మార్చి 5న నిరంతర ఉద్యమశీలిగా ఆయన తుది శ్వాస విడిచిండు. ఆయనకు వినమ్రంగా సామాజిక ఉద్యమ జోహార్లు.
- చెరుకు సుధాకర్ గౌడ్,మన ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు