
గోదావరిఖని, వెలుగు: నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరహక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తుందని, వామపక్ష భావజాలాన్ని, ఎర్ర జెండా ను కనిపించకుండా చేసేందుకు కుట్రలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని ఏఐటీయూసీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. జమిలి ఎన్నికల ద్వారా కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఇందుకోసం కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు. మీటింగ్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి సదానందం, ఎల్లాగౌడ్, కె.స్వామి, కె.కనక రాజ్, గోషిక మోహన్, గోవర్ధన్, రమేశ్‌కుమార్ మార్కపురి సూర్య, ప్రీతం పాల్గొన్నారు.