ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ

ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ

ప్రపంచపుటల్లో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న దేశం నేడు  ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా ఉంది.   వ్యక్తిగత అహంకారపూరిత ఆలోచనలతో పార్టీలు వ్యవహరించడంతో  ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకే పెనుప్రమాదం పొంచి ఉంది. 1975 అత్యవసర పరిస్థితితో ఆరంభమైన రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్టాన్ని ధిక్కరించడంలాంటివి ఈ  బీజేపీ ప్రభుత్వంలో మరింత వేగంగా రాజ్యాంగ స్ఫూర్తికే  భిన్నంగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రధానమైన మూడు అంగాలు శాసన వ్యవస్థ,  కార్యనిర్వాహక వ్యవస్థ,  న్యాయవ్యవస్థ.  ఈ మధ్య నాల్గో అంగంగా మీడియా గుర్తింపులోకి వచ్చింది.  రాచరిక వ్యవస్థలో  ఒక నానుడి  ఉండేది. ‘యథా రాజా- తథా ప్రజా’  రాజు మంచివాడు అయితే, సుగుణవంతుడైతే  ప్రజలు కూడా అలాగే ఉంటారని

 సామెత అర్థం.  

1980 తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ర్టాలలో సంకీర్ణ ప్రభుత్వాలతో, పార్టీ మార్పులతో రాజకీయాలలో  నైతిక విలువల పతనం వేగవంతమైంది. పార్టీలు మారడం ప్రభుత్వాలను పడగొట్టడం నైజంగా మారింది.  అప్పుడు కేంద్రం పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చింది. దాంతో  కొంత అదుపులో ఉన్నట్లు అనిపించినా ఆ చట్టంలోనున్న లొసుగులను ఆసరా చేసుకొని ఫిరాయింపుల పరంపర కొనసాగుతూనే ఉంది.

 యాంత్రిక సంబంధాలు

2004 కంటే ముందు 2జీ స్పెక్ట్రమ్‌‌‌‌‌‌లాంటి బోఫోర్సు కుంభకోణాలున్నా వాటిపైన సీబీఐ, ఈడీ విచారణ సీరియస్‌‌‌‌గా జరగడం.. గుడ్డిలో మెల్లలాగ పారదర్శకతకు నిదర్శనం.  దేశం అవినీతి మయమైన నేపథ్యంలో  వామపక్షాలు, యూపీఏ-1కు  కనీస అవసరాల కార్యక్రమం ప్రాతిపదికన మద్దతిచ్చి అమలుకు పూనుకోవడంతో సమాచార హక్కు చట్టం,  అటవీభూముల హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, గృహ హింస నివారణ చట్టం లాంటి ప్రగతిశీల చట్టాలు రూపొంది అమలులోకి వచ్చాయి.  దానితో కొంత జవాబుదారీతనం ఏర్పడింది.  అణుఒప్పందంలో యూపీఏ--1కు వామపక్షాలు వ్యతిరేకంగా నిలబడ్డాయి.  దీంతో సమీకరణలు మారిపోయి, 
ఆ తదుపరి యూపీఏ--2కు అవినీతి మరకలు అంటుకోవడం,  బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ  ప్రభుత్వం 2014లో అధికార పగ్గాలు చేపట్టడంతో రాజకీయాల్లో తుపాన్‌‌‌‌ లాంటి మార్పులు సంభవించాయి.  

హిండెన్​బర్గ్​ సంస్థ మూత!

నూతన ఆర్థిక విధానాల అమలుతో మానవీయ కోణంతో యూపీఏ1  ప్రభుత్వం అమలుచేస్తే మోదీ  పూర్తిగా దానికి భిన్నంగా అంటే దృక్పథాన్ని మార్చేసి కార్పొరేట్‌‌‌‌ సంస్థలకు పెద్దపీట వేస్తూ ప్రజలను మాటలతో మభ్యపెడుతూ ‘సబ్‌‌‌‌కా సాత్‌‌‌‌,  సబ్‌‌‌‌కా వికాస్‌‌‌‌’ లాంటి మాటలు చేస్తున్నాడు.  విజయ్​మాల్యా, నీరవ్‌‌‌‌ మోదీ, లలిత్‌‌‌‌ మోదీ, అదాని, అంబానీల అవినీతి పరాకాష్టకు చేరింది. నేడు  అమెరికా న్యాయ శాఖ నుంచి రూ.2500 కోట్ల అవినీతి కుంభకోణం విషయంలో అదానీపై ఆరోపణలు రావడం  చర్చనీయాంశంగా మారింది. అయితే, అదానీ మీద ఆరోపణలు చేసిన హిండెన్‌‌‌‌బర్గ్‌‌‌‌ అనే సంస్థ ఇప్పుడు తన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగించింది.  హిండెన్‌‌‌‌ బర్గ్‌‌‌‌ చేసిన ఆరోపణల వలన అదానీకి సంబంధించిన షేర్లు పాతాళంలోకి వెళ్ళాయి. ఇప్పుడు ఆ సంస్థను మూసివేయడం, ట్రంప్‌‌‌‌ అమెరికాలో అధికారంలోకి రావడం, మోదీ  ప్రభుత్వానికి ట్రంప్‌‌‌‌కు ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కార్పొరేట్‌‌‌‌ శక్తులను మోదీ ప్రభుత్వం ఎంతమేరకు సమర్థిస్తున్నదో ద్వారా అర్థం అవుతున్నది. 

రాజ్యాంగ ఉల్లంఘనలు

మోదీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు ఒకటి రెండు కాదు.  ఒకే దేశం -ఒకే పన్ను ఒకే విధానమని ఎన్ని పన్నులు మోపపడుతున్నాయో చర్చ జరగాలి.  నేడు జమిలి ఎన్నికలు పేరిట ఒకే దేశం ఒకే ఎన్నికకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను పడగొడుతున్నందునే పార్లమెంట్‌‌‌‌, అసెంబ్లీకి వేరువేరుగా ఎన్నికలు  జరుగుతున్నాయి. రాజ్యాంగం పటిష్టవంతంగా ఉన్నందునే  పాలకులు ఇప్పటికీ కొంత పరిమితులలో ఉంటున్నారు.  రాజ్యాంగ ఉల్లంఘనలకు, చట్టాలను ధిక్కరించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కింకర్తవ్యమేమిటని ఈనాడు  మేధావులు చర్చించాలి.  

వ్యవస్థలపై శీతకన్ను!

ఎన్నికల విధానంపై కూడా మోదీ శీతకన్ను పెడుతున్నాడు. ఎన్నికల  కమిషనర్ల నియామకంలో కూడా తన ముద్ర వేసుకునే ప్రయత్నం. ఆఖరుకు న్యాయ వ్యవస్థలో కొలీజియంలో మార్పులు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో కూడా రాజకీయ నీడలను పోత్సహించడం మోదీ దుర్మార్గానికి పరాకాష్ట,  కొందరు రాజ్యసభ లాంటి అనేక పదవులు పొందుతుండటం గుర్తించాలి. ఇక ఎన్నికలు ఎలా సజావుగా సాగుతాయి? 

పాలకుల గుప్పిట్లో అధికారులు! 

ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చట్టసభల ద్వారా ఎన్నికైన వారి  నుంచి ప్రభుత్వాల ఏర్పాటు జరుగుతున్నందున వారి కనుసన్నలలోనే ఐఏఎస్‌‌‌‌,  ఐపీఎస్‌‌‌‌ తదితర అన్ని శాఖల అధికారులు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.  వారు ఎవరి ఆదేశాలు లేదా సూచనలతో పని చేయాలి అనేది ప్రధాన ప్రశ్న?. 

 ప్రధానమంత్రి,  ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన విషయాలను వారికి అనుకూలమైనట్లు చెప్పిన వన్నీ కిక్కురుమనకుండా  చేస్తే ఎన్ని సంవత్సరాలు అయినా ఒకే పదవిలో ఎంత కాలమైనా ఉంటారు. లేకపోతే అడుగడుగునా బదిలీలు చేస్తూ చుక్కలు చూపిస్తారు. అందుకే ప్రభుత్వ యంత్రాంగం 
పారదర్శకతను, జవాబుదారీతనాన్ని కోల్పోయింది.  మీడియా -పూర్తిగా కార్పొరేట్‌‌‌‌ అధిపతుల చేతుల్లో బందీ అయ్యింది. 

చట్టసభలకు కార్పొరేట్లు

ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలలో ప్రతినిధులుగా ఎవరు  ఎన్నికవుతున్నారు.  పూర్తి కార్పొరేట్‌‌‌‌, పారిశ్రామికవేత్తలు, గుత్తేదారులు, రియల్‌‌‌‌ఎస్టేట్‌‌‌‌ వ్యాపారులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. అందుకనే చట్టసభలలో ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగిస్తున్న సమయమెంత, వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలతో వినియోగిస్తున్న సమయం ఎంత అనేది విశ్లేషణ జరగాలి.  ఈ మధ్య అదానీ ఆగడాలు, అవినీతిపై జేపీసీ వేయడానికి పార్లమెంట్‌‌‌‌ సెషన్​ ఎన్నో రోజులు వాయిదా పడుతూ ఎంత సమయం వృథా అయ్యింది. ప్రభుత్వ తప్పులను ప్రతిపక్షాలు ఎత్తిచూపాలి. వాటిపైన పారదర్శకతతో నిర్మొహమాటంగా చర్చ జరగాలి. తప్పులుంటే సరిచేయాలి.  మార్చుకోవాలి. కానీ, మంద బలంతో వాయిదా వేస్తూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుండటం ప్రజాస్వామ్య మూల సిద్ధాంతానికే విరుద్ధం. 

స్పీకర్​ ఓంబిర్లా వ్యాఖ్యలు

ఇటీవల బిహార్‌‌‌‌ రాజధాని  పాట్నాలో దేశంలోని అన్ని రాష్ర్టాల శాసనసభల స్పీకర్‌‌‌‌లు, మండలి చైర్మన్‌‌‌‌లకు  సంబంధించిన 85వ ఆలిండియా సదస్సు జరిగింది. ఈ సదస్సు ముగింపు రోజున లోక్‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు.  చట్టసభల పని దినాలు రానురాను తగ్గిపోతున్నాయని, దీనిపై 
ప్రిసైడింగ్‌‌‌‌ ఆఫీసర్లు చర్య తీసుకోవాలని సూచించారు. చట్టసభల్లో గందరగోళం జరగకుండా రాజకీయ పార్టీలు అంతర్గత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు మంచివే. దేశవ్యాప్తంగా  రాజ్యాంగ ప్రాథమిక హక్కులు,  ప్రభుత్వ పారదర్శకత,  ప్రజలకు జవాబుదారీపై చర్చ జరగాలి.  ప్రతిపక్షాలు మీనమేషం లెక్కించుకుంటూ ఉంటే మోదీ మరింత దూకుడు పెంచుతూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడటం ఖాయం.  

నేడు ఇండియా కూటమి పాత్రేమిటి?

కాంగ్రెస్‌‌‌‌ పార్టీ, వామపక్షాలు సిద్ధాంతపరమైన విలువలున్నందున సీట్ల పంచాయితీ మాని, సమన్వయానికి పెద్దపీట వేయాలి.  ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులను సీరియస్‌‌‌‌గా తీసుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా వ్యక్తిగత పోకడలు మాని దేశ భవిష్యత్‌‌‌‌కు ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేయాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికే పెనుముప్పు జరగనున్నది. ఇది సువిశాలమైన భారతదేశ భవిష్యత్​కే సవాలు కానుంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కండ్లు తెరచి, ప్రభుత్వానికి ముక్కుకు ముక్కుతాడు వేసే పద్దతులలో ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుము బిగించాలి.  ప్రజాస్వామ్యమంటే ప్రతిపక్షాలుంటాయి. లేకపోతే పక్క పాశ్చాత్య దేశాల్లాగ దిశదశ లేని దుస్థితి ఏర్పడక తప్పదు.  చేతులు కాలకముందు ఆకులు పట్టుకుంటే మంచిది.

- చాడ వెంకటరెడ్డి,
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు