
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొట్టి కార్పోరేట్లకు కట్టబెడ్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను రకరకాల సాకులతో ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి విజయవాడ వెళ్తూ మంగళవారం కొత్తగూడెం సీపీఐ ఆఫీస్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక హక్కులకు భంగం కలిగేలా కేంద్రం కొత్త చట్టాలు తెచ్చిందన్నారు. తెలంగాణలోని కొత్త మైన్స్‌ను సింగరేణికే ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా సీపీఐ శత వార్శికోత్సవాలను డిసెంబర్ 26 వరకు ఘనంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు.
ఎంతో మంది కమ్యూనిస్టులను చట్ట సభలకు పంపిన చరిత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ విస్తరణతో పాటు ప్రజాప్రతినిధిగా ప్రజల గొంతుక వినిపిస్తున్నారని కొనియాడారు. సీపీఐ జాతీయ నాయకులు రామకృష్ణ పాండే, జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా, నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.