కేసీఆర్​కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు: డి.రాజా

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణను పాలించే హక్కు కేసీఆర్​కు లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, మిత్రపక్షాలు విజయం సాధించబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే మోదీ ఈడీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం కాంగ్రెస్, సీపీఐ ఆధ్వర్యంలో కార్నర్ ​మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో గెలుపుతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్, మిత్రపక్షాలకు దారి చూపినట్లు అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు సింగరేణి కోల్ ​మైన్స్​ అదానీ చేతిలోకి పోయేలా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పందికొక్కుల్లా పదేండ్లు తిన్నరు

సంపదను సృష్టించి, ప్రజలకు పంచాల్సిన బీఆర్ఎస్​పాలకులు పంది కొక్కుల్లా పదేండ్లు తిన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ ఫ్యామిలీతో పాటు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు దోపీడీ చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే సింగరేణి సంస్థను ప్రైవేట్​పరం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే బీజేపీ, బీఆర్ఎస్ ​కాంగ్రెస్ ​లీడర్ల ఇండ్లు, ఆఫీసులపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నాయని పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆరోపించారు.