వలస దారులపై ట్రంప్ ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం : సీపీఐ నేత కె. నారాయణ

వలస దారులపై ట్రంప్ ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం : సీపీఐ నేత కె. నారాయణ

హైదరాబాద్​, వెలుగు: అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతుల్లో స్వస్థలాలకు పంపిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ట్రంప్ ప్రభుత్వం వలస దారులను తిప్పి పంపే పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ మేరకు అమెరికా పార్లమెంటు ముందు నుంచి ఆది వారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షగట్టినట్టు వలస దారులను జంతువుల తరహాలో వేటాడడాన్ని ఆక్షేపించారు.

అక్రమ వలస దారులను తిప్పి పంపడాన్ని తాము వ్యతిరేకించడం లేదని,  భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్న భారతీయ వలస దారులను వెనక్కు తీసుకుంటామని ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలస దారులను తిప్పి పంపడానికి ఎంచుకున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికాలో ఉన్న వలస దారులు దశాబ్దకాలంగా అక్కడ ఉంటున్నారని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ తీరుతో యువత జీవితం డిస్టర్బ్ అవుతున్నదని చెప్పారు.