ప్రతిపక్షాన్ని లేకుండా చేయడంతోనే..హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టారు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ప్రతిపక్షాన్ని లేకుండా చేయడంతోనే..హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టారు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

చుంచుపల్లి, వెలుగు: ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంప్ లో రజబ్ అలీ(పార్టీ ఆఫీస్) బిల్డింగ్​ను మంగళవారం రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బ్లాక్​మెయిల్​ రాజకీయాలతో మోడీ ప్రధాని అయ్యారని చెప్పారు. అసెంబ్లీలో కాకుల మధ్య కోకిల మాదిరిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని ఉన్నారన్నారు.

రౌడీలంతా చట్ట సభలకు వెళ్తున్నారని, ఈ పద్ధతి మారాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్  ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. కేసీఆర్  అహంకార ధోరణితో ప్రతిపక్షం లేకుండా చేద్దామనుకుంటే ప్రజలు ఓడించారని చెప్పారు. బంగ్లాదేశ్ లో ఎన్నో ఏండ్ల నుంచి అధికారంలో ఉన్న హసీనా ప్రతిపక్షాన్ని లేకుండా చేశారని, దీంతో ప్రజలు తిరగబడి ఆమెను దేశం నుండి తరిమికొట్టే పరిస్థితి వచ్చిందన్నారు.

అహంకారం పెరిగితే అధికారం ఉండదని తెలిపారు. సంపన్న వర్గాలకు పన్నులు తగ్గించి సామాన్యులకు పన్ను విధించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. రోడ్డు, విమానాశ్రయం, ఓడ రేవులకు ఎక్కువ బడ్జెట్  కేటాయించడం వల్ల కార్పొరేట్  వ్యవస్థ మాత్రమే బాగు పడుతుందని, రైతులకు ఒరిగేది ఏమిలేదన్నారు. ప్రతిపక్షాలు బలపడకపోతే ప్రజల సమస్యలు తీరవని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ తరహాలో ప్రజలు ఎదురుతిరుగుతారని తెలిపారు. కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో 90 శాతం అభివృద్ధి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. పోటు ప్రసాద్, బాగం మాధవ రావు, సాబీర్ పాషా, వాసిరెడ్డి మురళి పాల్గొన్నారు.