- ఇలాంటి మూవీస్‌ను ప్రభుత్వం ప్రోత్సహించొద్దు: సీపీఐ నారాయణ
హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని సీపీఐ నేత నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుష్ప 2 సినిమాతో సమాజానికి ఏం లాభం లేదన్నారు. స్మగ్లింగ్ ను ప్రోత్సహించేలా మూవీ ఉందని మండిపడ్డారు. రేవతి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హెల్త్ సీరియస్‌గా ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. రేవతి కుటుంబానికి సీపీఐ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.
పుష్ప 2 సినిమాలో అసభ్యకరమైన పాటలున్నయ్. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అదేమన్నా.. సమాజానికి ఉపయోగపడే సినిమానా? ఇలాంటి మూవీస్లను ప్రభుత్వం ప్రోత్సహించొద్దు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు సినీ, రాజకీయ వర్గాలు, కళాకారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి’’అని నారాయణ తెలిపారు.