
- కూల్ డ్రింక్ యాడ్ చేయొద్దని చిరంజీవిని కోరడంతో ఆయన మానేశారని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: సినీ నటులకు సినిమాలు కాకుండా ఓటీటీ సహా ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నా.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ నేషనల్ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కళామతల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయొద్దని సినీ ప్రముఖులకు హితవు పలికారు. సినీ నటులను ప్రజలు అనుసరిస్తూ ఉంటారని, అందుకే బెట్టింగ్ యాప్స్, బోగస్ రియల్ ఎస్టేట్, బోగస్ బంగారు వ్యాపారం వంటి ప్రకటనలు చేయొద్దని ఆయన కోరారు.
గుట్కా విషయంలో ఒక పనికిమాలిన తీర్పు వచ్చిందని, దానిని ఆసరా చేసుకుని ‘పాన్ పరాగ్’పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కోకో కోలా కంపెనీ కోసం నటుడు చిరంజీవి ప్రకటనలు ఇచ్చేవారని, అయితే.. ఓవైపు రక్తదానం చేస్తూ, మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని తాను ఆయనను ప్రశ్నించినట్లు చెప్పారు. ఆ యాడ్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత మళ్లీ అలాంటి ప్రకటనలు చేయనని చిరంజీవి తనతో చెప్పారని గుర్తుచేశారు.