వికారాబాద్ కలెక్టర్​పై దాడి హేయం .. రైతులపై కేసులు పెట్టొద్దు : నారాయణ

  • బీఆర్ఎస్ కుట్రలకు తెరతీసినట్టుంది

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ కలెక్టర్​పై దాడి హేయమైన చర్య అని సీపీఐ జాతీయ కార్య దర్శి కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ మగ్ధూం భవన్​లో మంగళవారం ఆయన రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ దాడిని సాకుగా తీసుకొని రైతులపై రాజకీయ పార్టీల ముద్రలు వేసి అరెస్టు చేయొద్దని కోరారు. ఫార్మాసిటీ వస్తే ఇబ్బందులు కలుగుతాయని రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఒక మంచి కార్యక్రమని, అయితే అందులో ప్రశ్నలను సింప్లిఫై చేయాలని చెప్పారు.

 రాష్ట్రంలో కులగణన అవసరమని, అది ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించేలా జరగాలన్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్ రాజకీయ కుట్రకు తెరతీసినట్లు కనిపిస్తున్నదని, పేదల భూజాలపై తుపాకులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.