మతోన్మాద బీజేపీని ఓడించేందుకు .. మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు. మునుగోడులో జరుగుతున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరోజు కూడా మునుగోడు అభివృద్ధి గురించి కానీ.. నియోజకవర్గ ప్రజా సమస్యల గురించి కానీ ఆలోచించలేదన్నారు. ‘‘ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అవసరం లేదు. కానీ రాష్ట్రంలో పాగా వేయాలనే దురుద్దేశంతో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో బీజేపీ రాజీనామా చేయించింది. ఆ ఫలితంగానే మునుగోడు లో బైపోల్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పతనం అవుతోందనడానికి ఈ పరిణామం నిదర్శనం’’ అని పల్లా వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘అమిత్ షా కాదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలవలేదు’’ అని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను ఈ సభకు హాజరైనట్లు పల్లా వెంకట్ రెడ్డి చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడల్లా..
‘‘కమ్యూనిస్టు పార్టీ గతంలో ఐదు పర్యాయాలు మునుగోడు నుంచి గెలిచింది. ఇప్పుడు మాత్రం ఎందుకు టీఆర్ఎస్ తో చేతులు కలుపుతోంది అంటూ కొన్ని మీడియాలలో కథనాలు వస్తున్నాయి. మతోన్మాద శక్తులను ఓడించే సంకల్పంతో మేం టీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నం’’ అని ఆయన ఈసందర్భంగా స్పష్టం చేశారు. ‘‘గతంలో మేం కాంగ్రెస్ మద్దతుతో మునుగోడులో గెలిచాం. అయినా 2004 నుంచి 2009 వరకు తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు వచ్చినప్పుడల్లా మేం టీఆర్ఎస్ నే బలపర్చాం. ఇటీవల హుజూరాబాద్, నాగార్జన సాగర్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కే మద్దతు పలికాం’’ అని పల్లా వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. ‘‘ప్రజా సమస్యలను మరిస్తే ఎవరినైనా ప్రశ్నిస్తం. మా పోరాటం కేసీఆర్ ను గద్దె దించేందుకు కాదు.. ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని సాధించేందుకు మాత్రమే. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తం’’ అని చెప్పారు.