ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి  

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి  

నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజా సమస్యలను పరిష్కరించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని మగ్దూమ్ భవన్ లో ఎమ్మెల్సీగా ఎన్నికైన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎన్నికల ఒప్పందం చేసుకొని ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేశామన్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్ బీసీ, డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ తోపాటు మూసీ పరివాహక ప్రాంతంలోని కాల్వలు పూర్తి చేయడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ శాసనమండలిలో ప్రజా గొంతుకగా ప్రభుత్వానని ప్రశ్నిస్తానని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాటి నుంచి నేటివరకు పేదల పక్షాన సీపీఐ పోరాడుతూనే ఉందన్నారు. నల్గొండ జిల్లా నుంచి రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, కమలాదేవి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి యోధులు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

అంతకుముందు నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని ఎమ్మెల్సీ సత్యం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు పల్లా నరసింహారెడ్డి, ఉజ్జని రత్నాకర్ రావు, మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు లొడంకి శ్రావణ్ కుమార్, పల్లా దేవేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.