- గత బీఆర్ఎస్ సర్కారుది నియంత పాలన: సీపీఐ నేతలు
- ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చింది
- సీపీఐ ఆఫీసులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియంత పాలన సాగించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలనను అందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సీపీఐ, ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషించా యని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం గన్ పార్క్ వద్ద సీపీఐ నేతలతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వారిని అవమానపరుస్తూ పరిపాలన కొనసాగించిందన్నారు. అందుకే మాజీ సీఎం కేసీఆర్ సర్కారుకు పదేండ్లకే నూరేండ్లు నిండాయన్నారు. తొలి తెలంగాణ సర్కారులో 17 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేయగా.. అందులో 12 మంది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారికే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు కలుపుకుని ప్రజాపాలనను అందిస్తుందని ఆశిస్తున్నామని, అలా జరగనట్లయితే గత బీఆర్‌ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీపీఐ విరోచితంగా పోరాడిందన్నారు. సీపీఐకి ప్రజల్లో మంచి ఆదారణ ఉందని, వారి సమస్యల పట్ల గళమెత్తడంతో పాటు వాటి పరిష్కారానికి ఉద్యమించడం ద్వారా వారితో మమేకం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసే విధంగా బలం పెంచుకోవాలని సూచించారు.
చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఆత్మవంచన పాలన చేశారని, అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మగౌరవ పాలన సాధించాలని కోరారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో గత పదేండ్లుగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గత సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్, ఈటీ నర్సింహ్మ, సాయిలుగౌడ్, ఉజ్జని రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.