ఇండ్ల పట్టాలు ఇంకెప్పుడిస్తరు?

  • ఉమ్మడి వరంగల్‌‌‌‌లో రోడ్డెక్కిన పేదలు
  • వరంగల్,హనుమకొండ కలెక్టరేట్ల ముట్టడికి యత్నం
  • సీపీఐ లీడర్లు,జన్నాన్ని అడ్డుకున్న పోలీసులు
  • కాళోజీ జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • పోలుసుల అనుమతితో వరంగల్,హనుమకొండ కలెక్టరేట్లలో వినతి పత్రాల అందజేత

హనుమకొండ, వరంగల్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వరంగల్, హనుమకొండలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేదలు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా బాలసముద్రంలోని ఏకశిలా పార్కు వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఇక్కడ ధర్నా చేసిన తర్వాత వేలాది మంది వరంగల్, హనుమకొండ కలెక్టరేట్ల ముట్టడికి బయల్దేరారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సీపీఐ నాయకులు, గుడిసెవాసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను అరెస్ట్ చేసేందుకు​ప్రయత్నించగా.. గుడిసెవాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో కాళోజీ జంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత వరంగల్ ఏసీపీ గిరికుమార్, సుబేదారి సీఐ రాఘవేందర్, ఇతర పోలీస్ ఆఫీసర్లు నారాయణతో మాట్లాడారు. పరిమిత సంఖ్యలో కలెక్టరేట్‌‌‌‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. నారాయణతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు వరంగల్, హనుమకొండ కలెక్టరేట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి: నారాయణ
ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదల వైపు ఉంటుందో.. భూ కబ్జాలకు పాల్పడుతున్న ల్యాండ్ మాఫియా వైపు ఉంటుందో తేల్చుకోవాలని నారాయణ అన్నారు. తాము ఎర్రజెండాను నమ్ముకున్నామని, ప్రభుత్వం పేదలకు కాకుండా భూ మాఫియాకు సహకరిస్తే తమతో యుద్ధానికి రెడీగా ఉండాలని హెచ్చరించారు. పేదలను గుడిసెల్లో ఉండనివ్వకుంటే.. తాము జైలులో ఉండేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. వరంగల్‌‌‌‌లో భూ మాఫియా చెరువులు కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటుంటే రెవెన్యూ, పోలీస్ శాఖలు ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. వరంగల్​లో పేదలందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు గడిచినా సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, పాలకులకు  చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

కమీషన్ ఏజెంట్లను పెట్టుకొని ప్రాజెక్టులు కడుతున్నరు
‘‘నిలువ నీడ లేని పేద ప్రజల కోసం సీపీఐ నాయకులు అండగా ఉన్నారు. పేదలపై అక్రమ కేసులు పెడితే.. భూ పోరాటాలను బంద్ చేస్తామని అనుకుంటున్నారా? మరింత ఉధృతం చేస్తాం” అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. సోమవారం బొల్లికుంట శివారులోని ప్రభుత్వ భూమిలో సీపీఐ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం వేసిన గుడిసెలను నారాయణ సందర్శించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భూపోరాటాన్ని ఆపలేరని, ఎంత నిర్భంధం విధిస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుందని, పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీగా భూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, కమీషన్ ఏజెంట్లను పెట్టుకొని ప్రాజెక్టుల నిర్మిస్తూ.. సొంత ఆస్తులను పెంచుకునే రీతిలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వరకు ఉద్యమిస్తామని చెప్పారు.