- గత తప్పులు సరి చేసి విప్లవోద్యమ నిర్మాణం చేస్తాం
- ఖమ్మంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ యూనిటీ బహిరంగ సభలో వక్తలు
ఖమ్మం టౌన్, వెలుగు : కమ్యూనిజం అంతమైందనే ఫాసిస్ట్ శక్తులకు సమాధానంగానే సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ గా ఆవిర్భవించిందని బెంగాల్ సీపీఐ ఎంఎల్ ఆర్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ అన్నారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, సీపీఐ ఎంఎల్ రివల్యూషనరీ ఇన్షియేటివ్, పీసీసీ సీపీఐ ఎంఎల్ మూడు పార్టీల యూనిటీ మహాసభల సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లోని రవన్న, సంతోష్ రాణా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెచ్చల రంగయ్య అధ్యక్షత వహించిన
ఈ కార్యక్రమంలో ప్రదీప్ సింగ్ ఠాకూర్‌తో పాటు సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, త్రిపుర పీసీసీ సీపీఐ ఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుభాష్ దేవ్, సంజయ్ సింగ్వి, దినేశ్ గొహైన్ మాట్లాడారు. గతంలో జరిగిన పెద్ద తప్పిదాన్ని విప్లవ పార్టీలు గుర్తించాయని, దాన్ని సరి చేసేందుకు భవిష్యత్తులో బలమైన -విప్లవోద్యమ నిర్మాణం కోసం మాస్ లైన్ అంతరించిందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయమంటూ ఇండియా వేదిక వస్తోందని, కానీ అది రాజకీయ ప్రత్యామ్నాయమే కానీ మరొకటి కాదన్నారు.
కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అధికారానికి మాత్రమేనని, బీజేపీ వ్యతిరేక విధానాలకు కాదన్నారు. మోదీ హిట్లర్‌కు వారసుడన్నారు. కేసీఆర్ పాపాలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయన్నారు. సీపీఐ (ఎంఎల్) మాస్ నేతలు కేజీ రాంచందర్, కె.రమ, ఆర్, చంద్రశేఖర్, గుమ్మడి నర్సయ్య, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పూజారి, జీవన్ కుమార్, రవిబాబు, నెట్కార్, త్రివేది పాల్గొన్నారు. అంతకుముందు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్కాలేజీ నుంచి 30 వేల మందితో ర్యాలీ మొదలుపెట్టి పెవిలియన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళారూపాల కోలాటం, డప్పు చప్పుళ్లతో మార్మోగింది.