-
రైలు పట్టాలపై సీపీఐ (ఎంఎల్) నేత మృతదేహం
-
రామన్నపేట వద్ద రాయల చంద్రశేఖర్ డెడ్ బాడీ లభ్యం
-
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి సంతాపం
ఖమ్మం: సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు రాయల చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఇవాళ తెలవారుజూమున ఖమ్మంకు సమీపంలోని రామన్నపేట దగ్గర రైలు పట్టాలపై పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని కొందరు చెబుతుండగా, ప్రమాదవశాత్తు రైలు ఢీకొని చనిపోయారని బంధువులు అంటున్నారు. ప్రమాదం జరిగితే తెల్లవారుజామున రైలు పట్టాల దగ్గరికి ఎందుకు వెళ్లారనేది అనుమానాస్పదంగా మారింది. చంద్రశేఖర్ సీపీఐ ఎం ఎల్ కేంద్ర కమిటీ నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దివంగత రాయల సుభాష్ చంద్రబోస్ కి ఆయన స్వయాన సోదరుడు. చంద్రశేఖర్ కి భార్య విమలక్క, కుమారుడు పావెల్ ఉన్నారు. చంద్రశేఖర్ కూడా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. చంద్రశేఖర్ మరణాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. రాయల స్వగ్రామం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు. చంద్రశేఖర్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.