ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలె

ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలె

జనగామ జిల్లా: తెలంగాణ వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని సీపీఐ (ఎంఎల్ ) రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ కుటుంబ సభ్యులతో కలిసి 37 వ వర్ధంతిని నిర్వహించారు. ఐలమ్మ స్మారక స్థూపం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ రాజా మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్ల ఆగడాలను ఎదిరించిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. విస్నూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలపై తిరుగుబాటు చేసి తెలంగాణ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీర వనిత ఐలమ్మ అని అన్నారు. ఐలమ్మ తెలంగాణకు ఐకాన్ గా నిలిచిందని, ఆమె నిత్యం ప్రజా పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. ఆమె అందించిన విప్లవ స్ఫూర్తితో ముందుకెళ్లాలని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం ఐలమ్మ జయంతి, వర్థంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు.

ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ అనంతోజు రజిత, సీపీఐ(ఎంఎల్ ) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మాన్యపు భుజందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదార్, ఐలమ్మ మనుమరాలు రాపర్తి మంజుల  మాట్లాడుతూ..  ఐలమ్మ తెలంగాణకు గర్వకారణమని, ఐలమ్మ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల యాకయ్య(ఇంజనీర్ ), చిట్యాల సంధ్యారాణి, చిట్యాల యాకయ్య, చిట్యాల లింగమ్మ,  సీపీఐ(ఎంఎల్ ) లిబరేషన్ జిల్లా సభ్యులు జీడి సోమయ్య, రజక సంఘం నాయకులు జ్యోతి యాదగిరి, గ్రామస్తులు పాల్గొన్నారు.