రాష్ట్రంపై కేంద్రం వివక్ష : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

రాష్ట్రంపై కేంద్రం వివక్ష : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
  • రూపాయిలో 40 పైసలే ఇస్తున్నది: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే రూపాయిలో 40 పైసలే రిటర్న్ వస్తున్నదని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆదాయాన్ని తీసుకుని వాటిపైనే వివక్ష చూపడం కరెక్ట్ కాదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే సపరేట్ దక్షిణ భారత దేశం డిమాండ్ ​వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ‘‘కేంద్రంతో  స్నేహంగా ఉన్న ఏపీకి కేంద్ర బడ్జెట్​లో రూ.30 వేల కోట్లు ఇచ్చారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. 

తెలంగాణలోని ఏ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు. దేశంలో తెలంగాణ భాగస్వామ్యం కాదా?’’ అని కూనంనేని నిలదీశారు. బయ్యారం స్టీల్​ఊసేలేదన్నారు. వివక్షత వల్ల తమిళనాడు స్టేట్ తన బడ్జెట్ నుంచి రూపీ సింబల్​ను తొలగించిందని చెప్పారు. డీలిమిటేషన్​   పర్సెంటేజీ  ప్రకారం.. దక్షిణాదికి సీట్లు పెరగడం లేదని..కానీ ఉత్తరాదికి పెరుగుతున్నాయని తెలిపారు. 

అందుకే దక్షిణ రాష్ట్రాలు సమాఖ్యగా ఏర్పాటవుతున్నాయన్నారు. రాష్ట్రానికి  కేంద్రం  ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని వేల కోట్లు పెండింగ్​లో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి వారధిగా ఉన్న గవర్నర్ ​తెలంగాణను అప్పుల నుంచి గట్టెక్కించాలని కోరారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో వేసిన వారే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.