సర్వేలో మిస్సయినోళ్ల వివరాలూ సేకరించాలి : కూనంనేని

సర్వేలో మిస్సయినోళ్ల వివరాలూ సేకరించాలి : కూనంనేని
  • రిజర్వేషన్లపై మరోసారి సభ పెట్టాలి: కూనంనేని 
  • 2014లో ఒక్క రోజులోనే హడావుడిగా సర్వే చేశారని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు:  కులగణన సర్వేలో మిస్సయిన కుటుంబాల పరిస్థితి ఏంటని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. 3.5 లక్షల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నదని, వారి వివరాలను ఎలా తీసుకుంటారని ఆయన అడిగారు. గ్రామసభలు లేదా వార్డు సభలు పెట్టడం ద్వారా లేదంటే పంచాయతీల్లో సమావేశాలు పెట్టయినా వివరాలు సేకరిస్తే బాగుంటుందని అన్నారు. మంగళవారం కులగణన సర్వేపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జరిగిన తప్పులను ఎలా సరిచేయాలన్న దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘2014లో సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులోనే హడావుడిగా చేశారు. ఆ హడావుడి సర్వేకు ఇప్పుడు 50 రోజుల పాటు చేసిన కులగణన సర్వేకు కొంత తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రెండు సర్వేలకు పోలిక అనవసరం” అని పేర్కొన్నారు. ప్రస్తుతం కులగణన సర్వే చేశారుగానీ.. దాని పర్పస్​ ఏమిటనేది మాత్రం అసెంబ్లీలో చెప్పలేదని ఆయన అన్నారు. రిజర్వేషన్లను పెంచుతారా లేదా అన్న దానిని మాత్రం వివరించలేదని.. రిజర్వేషన్లు ఇస్తారో లేదో చెప్పాలని, లేదంటే మరోసారి సభను ఏర్పాటు చేసి దానిపై చర్చ పెట్టాలని డిమాండ్​ చేశారు. 

రిజర్వేషన్లపై మభ్యపెట్టొద్దు

కులగణన సర్వేపై తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఎలాంటి ప్రయోజనం ఉండదని కూనంనేని అన్నారు. వందల ఏండ్ల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలు వివక్షకు గురవుతున్నారని చెప్పారు. అగ్రకులాలతో పోలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోనే నైపుణ్యం ఎక్కువని అన్నారు. గత పదేండ్లలో పేదలు ఎదగలేదని, అది గత ప్రభుత్వాల వైఫల్యాలేనని తెలిపారు.

రిజర్వేషన్ల విషయంలో మభ్యపెట్టొద్దని, అలా చేస్తే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందన్నారు. కులగణన సర్వేని ప్రభుత్వం అత్యంత క్లారిటీతో పారదర్శకంగా నిర్వహించారని, తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అసెంబ్లీలో పెట్టారని తెలిపారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్​లో అయినా ఏం చేస్తారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు.