
కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యునిస్టులకు ఎప్పుడు తగ్గాలో..ఎప్పుడు నెగ్గాలో తెలుసన్నారు.
కమ్యూనిస్టులు త్యాగదనులని, కమ్యూనిస్టులు లేకుంటే పేద వాడి గురించి పోరాడే వారు లేరన్నారు. కమ్యూనిస్టులు, మావోయిస్టుల విధానమే తమ విధానమని అనేక సార్లు కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా కెసీఆర్ ను గౌరవిస్తామని, ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవాలని సూచించారు. సీఎం పదవి లేకుండా కేసీఆర్ ఉండలేరా అని సాంబశివరావు ప్రశ్నించారు.
ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు కూనంనేని. ఎక్కడో ఉండి మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐకి ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎవరికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాలో తెలుసన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగునంగా నిర్ణయాలు తీసుకుంటామని సాంబశివరావు అన్నారు.