
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాజ్యంగ సవరణ చేసి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును తీసుకొచ్చారని, దీనికి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ఆలోచన సీపీఐకి లేదని, బీసీ రిజర్వేషన్లపై కవిత బీజేపీపై యుద్ధం చేయాలని ఆయన సూచించారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల ద్వారా గద్దెనెక్కుతుందని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించడం సరికాదని చెప్పారు. చట్ట సవరణ పేరుతో వక్ఫ్ బోర్డులో ఇతర సామాజికవర్గాల వారిని సభ్యులుగా చేర్చడం వెనక ఏదో కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదని, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నామని వివరించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయ వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఎవరో మాజీ మంత్రి కేటీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్రం ఇందుకు సిద్ధంగా లేనట్టుగా వ్యవహారిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్విభజన చేయాల్సివస్తే అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు