- ధరణి పేరుతో భూమాతను బంధించారని విమర్శ
హైదరాబాద్, వెలుగు : ధరణి తప్పులు బయట పడతాయనే బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. పదేండ్ల పాటు అధికారంలో ఉండి ఎవ్వరినీ మాట్లాడనివ్వలేదని, ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ధరణి పేరుతో భూమాతను బీఆర్ఎస్ నేతలు బంధించారని, ఆ సంకెళ్లు తెంచేందుకు భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కూనంనేని తెలిపారు. ఒక్కరిపై కేసు పెడితే అసెంబ్లీ జరగనివ్వకుండా బీఆర్ఎస్ నేతలు రచ్చ చేయడం ఏందని నిలదీశారు. కేటీఆర్ ఒక్కరిపైనే కేసు కాలేదని, తనపైనా, రాహుల్ గాంధీపైనా, రేవంత్ రెడ్డిపైనా గతంలో కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. సానుభూతి రావాలంటే గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేయాలని, ఇలా ఆందోళన చేయడం సరికాదని హితవు పలికారు.
సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఓపికకూ హద్దుంటుందని చెప్పారు. ధరణినే బీఆర్ఎస్ ను ఓడించిందన్నారు. భూభారతిలో కాస్తుదారు కాలం చేర్చాలని, కోనేరు రంగారావు సిఫారసులు అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పోయిన ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు ఏపీ సీఎంతో తెలంగాణ సీఎం మాట్లాడాలని కోరారు.