
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టులు త్యాగధనులని, కమ్యూనిస్టులు లేకుంటే పేదల కోసం పోరాడేవారే ఉండరన్నారు. వంద ఏండ్ల చరిత్ర కలిగిన సీపీఐకి ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికీ ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలో తెలుసన్నారు. ఆర్టీసీకి చేసిన అన్యాయం వల్ల హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించలేదని గుర్తుచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులకు కేసీఆర్ తీరని మోసం చేశారని మండిపడ్డారు. కమ్యూనిస్టుల ఎజెండా తీసుకుంటామని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతామని, కార్మికులకు అనుకూలమైన చట్టాలు చేస్తామని బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందన్నారు.