
- సమన్వయంలో కొంత లోపం ఉన్నది: కూనంనేని
- కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్టుల
- కోసం కృషిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అయితే, సమన్వయంలో మాత్రం కొంత లోపం కనిపిస్తున్నదని, దానిని సరిదిద్దుకోవాలని సూచించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్టులు రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు, ఎంపీ వంశీ తనకు చెప్పారని, ఆ కుట్రలను తిప్పికొట్టి ఎయిర్పోర్టులను తీసుకొచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులను ఆదుకున్నట్టే 2 కోట్ల మందికిపైగా ఉన్న అసంఘటిత కార్మికుల సంక్షేమానికీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. కాగా, సీఎంను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వచ్చినా.. ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆవేదనకు గురిచేసిందని తెలిపారు.