కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయండి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయండి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఎకరా సాగు చేస్తే కరెంట్​బిల్లులకే రూ.40 వేల ఖర్చు అవుతుంది.. అందుకే ఆ ప్రాజెక్టును వదిలేయండి’ అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో ఆయన బుధవారం మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పైనుంచి గ్రావిటీతో నీరు తేగలిగితే  ఎకరాకు రూ.10 వేలు మాత్రమే ఖర్చవుతుందని, ఆ దిశగా సర్కారు ఆలోచన చేయాలన్నారు.

పనికిరాని ప్రాజెక్టులను వదిలేసి గ్రావిటీతో నీరందించే ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి కూనంనేని సూచించారు. లాభనష్టాలు సైతం బేరీజు వేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్​శాఖలో   సంస్కరణలు రావాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులపై నమోదైన కేసులు తొలగించాలని కోరారు.

రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నైజిరియా నుంచి డ్రగ్స్ రాకుండా అరికట్టాలని, మహిళలపై దాడులు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలన్నారు. లెఫ్ట్​ భావాలున్నవారిపై, సామాజిక స్పృహ ఉన్నవారిపై అర్బన్ నక్సల్స్ పేరుతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వరవరరావు తదితరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రంలో 9 లక్షల సాదాబైనామాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

వైఎస్సార్​ కౌలు రైతులకు కార్డులిచ్చి భరోసా కల్పించారని, అదే మాదిరిగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుతో పాటు నిర్మించిన వాటిని పంపిణీ చేయాలని కోరారు. జర్నలిస్టులకు స్పెషల్ పాలసీ తీసుకురావాలని, ఆరోగ్య, పెన్షన్, ఇండ్ల సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ను రద్దు చేయాలని, ఆర్టీజెన్స్ కార్మికులపై ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. సింగరేణిలోని బొగ్గును ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని కోరారు.