ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి మహిళలేమైనా ఫ్యాక్టరీలా: సీపీఐ నారాయణ

ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి మహిళలేమైనా ఫ్యాక్టరీలా: సీపీఐ నారాయణ

డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే... డీలిమిటేషన్ అంశంతో జనాభా పెరుగుదల ఆవశ్యకతను తెరపైకి తెచ్చింది. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు వంటివారు ఎక్కువమంది పిల్లలను కనమని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఐ నాయకుడు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువమంది పిల్లలను కనమని పిలుపునివ్వడం రాజకీయ దివాలాకోరుతనమేనని అన్నారు. ఎక్కువమంది పిల్లలను కనడానికి మహిళలేమైనా ఉత్పత్తి పరిశ్రమలా అని ప్రశ్నించారు నారాయణ.

వ్యవస్తీకృత హింసకు మహిళలే సమిధలని.. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు నారాయణ. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

కాగా.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు వెంటనే పిల్లల్ని కనాలని చెప్పారు.వీలైతే ఒక్కో జంట ఎక్కువ మంది పిల్లల్ని కనాలని  తమిళనాడు యువ జంటలకు పిలుపునిచ్చారు. వారికి తమిళ పేర్లు పెట్టాలని అన్నారు. 

డీలిమిటేషన్ ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన జరగొచ్చని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న క్రమంలో  సీఎం ఎంకే స్టాలిన్ ఇలా చేస్తే రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రకటన చేసిన ఒకరోజు తర్వాత స్టాలిన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.