మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించెటోళ్లు.. హైదరాబాద్​ ద్రోహులే: సీపీఐ నారాయణ

మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించెటోళ్లు.. హైదరాబాద్​ ద్రోహులే: సీపీఐ నారాయణ
  • మూసీ రివర్ డెవలప్​మెంట్​పైఫోకస్ చేయాలి
  • ఏ ఒక్కరికీ  అన్యాయం జరుగొద్దు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు
  • ఓట్ల కోసమే బీజేపీ నార్త్, సౌత్ విభేదాలు
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి

న్యూఢిల్లీ, వెలుగు: మూసీ ప్రక్షాళనను ఎవరు అడ్డుకున్నా.. వాళ్లు హైదరాబాద్ కు ద్రోహం చేసినవాళ్లే అవుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నగరంలోని ఫిరంగి నాలా ఆక్రమణలను ఖాళీ చేయించాలని, మూసీ ప్రక్షాళన చేపట్టాలని తాను ముందునుంచి డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం తాను పార్టీ సెక్రటరీగా పాదయాత్ర కూడా చేసినట్టు చెప్పారు. ఇప్పుడు కూడా తనతోపాటు తమ పార్టీ అదే మాటకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అయితే, మూసీ విషయంలో బీజేపీ లోనే ద్వంద వైఖరి ఉన్నదని తెలిపారు. ఒక వర్గం మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తుంటే.. మరో వర్గం విమర్శిస్తున్నదని అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని తెలిపారు. శనివారం ఢిల్లీలోని సీపీఐ కార్యాలయం అజయ్ భవన్ లో నారాయణ మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన తప్పక చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగకుండా  ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది తమ ప్రతిపాదన అని పేర్కొన్నారు.  పలు ప్రముఖ దేశాల్లోని  సిటీలతోపాటు ఏపీలోని తెనాలి లో ఊరి మధ్య నుంచి అందమైన కాలువ వెళ్తుందని,  అలాంటి మంచి కాలువలు ఉండాలి కానీ, మూసీలాంటి మురికి కాలువలు ఉండొద్దని తెలిపారు.

మహేశ్వర్ రెడ్డిది చిలుక జోస్యం 

తెలంగాణ సీఎంను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మారుస్తుందంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి చిలుక జోస్యం చెబుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. చిలుక జోస్యానికి, ప్రాక్టికల్ కు సంబంధం లేదని అన్నారు. మహేశ్వర్ రెడ్డివి కేవలం కలలు మాత్రమే అని తెలిపారు.  

నార్త్, సౌత్ విభేదాలు సృష్టిస్తున్నరు

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పాలన దరిద్రంగా ఉన్నదని, అది వదిలిపెట్టి బీజేపేతర ప్రాంతాల్లో పాలనపై ప్రధాని మోదీ కామెంట్స్​ చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని నారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన తీరు, ఉచితాలపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై పొలిటికల్ గా మోదీ ఒకవైపు,  అడ్మినిస్ట్రేషన్​పరంగా గవర్నర్లతో మరోవైపు నుంచి దాడి జరుగుతున్నదని అన్నారు.  సౌత్, నార్త్ పేరిట కామెంట్లతో దేశాన్ని విచ్ఛిన్నం చేసి, నార్త్ ఇండియాలో మెజార్టీ ఓట్లు సాధించేలా రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ పేరుతో దేశాన్ని ఐక్యంగా ఉంచొద్దన్న యోచనలో బీజేపి ఉన్నదని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు బలపడే కొద్దీ జాతీయ పార్టీలకు నష్టం ఉంటుందని చెప్పారు. అది లెఫ్ట్ పార్టీలకూ అతీతమేమీ కాదని తెలిపారు. ఒకప్పుడు బంద్ లు, రాస్తారోకోలు, జన జీవ నాన్ని  స్తంభింపజేసే పరిస్థితులు ఉండే వని, అయితే ఇప్పుడు అవి తగ్గాయని చెప్పారు.