‘నాగార్జున.. ఎందుకు ఇంత కక్కుర్తి’.. CPI నారాయణ హాట్ కామెంట్స్

హైదరాబాద్, వెలుగు:  మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్​ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులను ఆక్రమించారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. ఆ భూముల్లో కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు వ్యాపార సంస్థలను నిర్మించారని చెప్పారు. వారితో పాటు ఇతరులు కబ్జాలు చేసిన భూములపై హైడ్రా కొరడా ఝులిపించాలని కోరారు. పైకి రాజకీయ నాయకులుగా నటిస్తూ లోపల  కబ్జాలకు పాల్పడుతున్నారని, హైదరాబాద్​లో నాలాలు, చెరువులు, కుంటలు కబ్జా కావడంతో పదినిమిషాలు వర్షం పడితే సిటీ నరకంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు ఆక్రమించడం తగదు

సినీ హీరో నాగార్జున అధినేతగా ఉన్న ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చిన ప్రదేశాలను ఆదివారం ఆయన ఆ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. చెరువు ఎఫ్టీఎల్​లో ఉన్న భూమిలో ఫంక్షన్ హాల్ కట్టి కోట్లాది రూపాయలు సంపాదించాడని, ఆ డబ్బు రికవరీ చేసి పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూములను ఆక్రమించడం తగదన్నారు. సినిమాలలో నటిస్తే కోట్ల రూపాయలు ఆయనకు వస్తాయని, ఇలా భూముల కబ్జా కక్కుర్తి ఎందుకని విమర్శించారు. హైడ్రాతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నారు. 

హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ఆక్రమించినన్ని భూములు ఇంకెవరూ ఆక్రమించలేదని ఆరోపించారు. ఆ భూములను కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా  వ్యవహరించి ఏ పార్టీ  వారైనా అక్రమ నిర్మాణం చేపట్టినా హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని చెప్పారు. పేద, మధ్యతరగతి పేదవారు నోటరీ భూముల్లో ఇండ్లు కట్టుకున్నారని, అలాంటి వారికి రెగ్యులర్ చేయాలని కానీ, వారి పొట్ట కొట్టవద్దని కోరారు. ఆయనతో పాటు సీపీఐ నేతలు పశ్య పద్మ, పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, తదితరులు ఉన్నారు.