నాంపల్లి బజార్ ఘాట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన 9 మందివి ప్రభుత్వ హత్యలేనని సీపీఐ నారాయణ అన్నారు. ప్రమాదానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. నిఘా వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన చెప్పారు.
మంత్రి కేటీఆర్ 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు. ఒక్కొక్క మృతుడికి 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అగ్నిప్రమాద ఘటనా స్థలిని సీపీఐ నాయకులు నారాయణ, చాడా వెంకటరెడ్డి, అజీజ్ పాషా, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ పరిశీలించారు. అధికారులను ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏం జరిగిందంటే..
నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న ఓ నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్ లో నవంబర్ 13వ తేదీన ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించారు.