సమతామూర్తి విగ్రహంపై నారాయణ కీలక వ్యాఖ్యలు

దేవరకొండ, వెలుగు: సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో లక్షల కోట్ల రియల్ ​వ్యాపారానికి తెర లేపారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పల్లా పర్వత్​రెడ్డి 25వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. దైవ భక్తితో విగ్రహం ఏర్పాటు చేయలేదని, రియల్​ వ్యాపారాన్ని పెంచుకోడానికే ఏర్పాటు చేశారని ఆరోపించారు. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీలతో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించిన గొప్ప పోరాటయోధుడు పల్లా పర్వత్​రెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.