
- పొత్తులో భాగంగా ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలి
- సీపీఐ నేత కె.నారాయణ
హనుమకొండ, వెలుగు: ఎన్నికల పొత్తులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఐకి రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని మాట ఇచ్చిందని, ఆ మాటకు పార్టీ కట్టుబడి ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. సీపీఐ శత వసంతాల సభ సందర్భంగా వరంగల్ కు వచ్చిన ఆయన హనుమకొండలోని పార్టీ జిల్లా ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటాలో తమ పార్టీకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన కులగణనను స్వాగతిస్తున్నామని, దానివల్ల రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయన్నారు.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ చెడగొట్టిందని, ఆ తప్పులను సరిచేయడానికి రేవంత్ సర్కారు తంటాలు పడుతోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని, వాటికి వ్యతిరేకంగా నిలబడిన కాంగ్రెస్ ను విమర్శించబోమన్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యే లుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పేనని, అది ప్రజా తీర్పును అవమానించడమే అవుతుందన్నారు.