ప్రైవేటు నిర్మాణాలను ప్రభుత్వ సంస్థలతో పోల్చడం తప్పు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారని.. ఆయన అక్కడి నుంచి దిగొద్దని సూచించారు. హైడ్రాతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది లేదా.. వాళ్ల ఒత్తిడితో రేవంత్ అయినా జైలుకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
హైదరాబాద్ సీపీఐ ఆఫీస్ లో నారాయణ మీడియాతో మాట్లాడుతూ 'శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మ స్థలం జైళ్లను బాగుచేయాలి. రేవంత్ రెడ్డి పులి మీద నుంచి దిగొద్దు.. దిగితే మింగేసే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆంధ్రోళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చెప్పింది. హైదరాబాద్లో చెరువులు, నాలాలు కబ్జాలు చేయడం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో అర్థం కావటం లేదు. అందుకే అరగంట వర్షం పడితేనే నగరం మునిగిపోతుంది. రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్న. కానీ హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చుతున్నారు. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి. చెరువుల్లో ని ర్మించిన సర్కార్ఆఫీసులు ప్రజలకు సేవ చేస్తున్నాయి.
ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులు కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారు. అదానీకి సెబీ దాసోహమైంది. ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలి' అని నారాయణ డిమాండ్ చేశారు.