- ఉపా చట్టాన్ని రద్దు చేయాలి
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్
కరీంనగర్ సిటీ, వెలుగు: దండకారణ్యంలో ఆదివాసీలపై దాడులను వెంటనే ఆపాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల మరణించిన పౌర హక్కుల నేత, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంస్మరణ సభను ఆదివారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఉమ్మడి జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి విరసం ప్రతినిధి బాలసాని రాజయ్య, పౌర హక్కుల సంఘం ప్రతినిధి శ్రీపతి రాజగోపాల్ నారా వినోద్ అధ్యక్షత వహించారు.
ఈ సభలో పాల్గొన్న చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఒక వేదికను ఏర్పాటు చేద్దామన్నారు. అనంతరం ప్రొఫెసర్ సాయిబాబా కూతురు మంజీర మాట్లాడుతూ సాయిబాబాను కేంద్ర ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు. జైలులో సమయానికి మందులు, పుస్తకాలు, ఇతర సామగ్రిని కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.
దళితులు, పీడిత ప్రజల పక్షాన, ఆదివాసీలపైన ప్రభుత్వాల దమనకాండకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే సాయిబాబాపై కక్ష కట్టిందని ఆరోపించారు. జైళ్లలో నిర్భందించిన ఆదివాసీ యువత కోసం ఒక విద్యా సంస్థను నెలకొల్పే ఆలోచన సాయిబాబాకు ఉండేదని పేర్కొన్నారు. ఈ సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, ఐఎఫ్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె. విశ్వనాథ్, రిటైర్డ్ ఎంఈఓ వీరగోని పెంటయ్య, డీఎల్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.
యువజన కమిషన్ ఏర్పాటు చేయాలి
గోదావరిఖని : రాష్ట్ర ప్రభుత్వం యువజన కమిషన్ను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ గోదావరిఖని ఎన్టీపీసీలోని ఓ హోటల్లో రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను సైతం హరించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి.. పదేండ్లలో 20 లక్షల కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్ మాట్లాడుతూ సిద్ధాంతపరమైన రాజకీయ, శాస్త్రీయ ఆచరణకు వర్క్ షాప్ లు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో బాధ్యులు శనిగరపు చంద్రశేఖర్, కల్లూరు ధర్మేంద్ర, నెర్లకంటి శ్రీకాంత్, మానస్ కుమార్, మార్కపురి సూర్య, లింగం రవి, తాండ్ర సదానందం, గౌతమ్ గోవర్ధన్ పాల్గొన్నారు.