
- సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా
హైదరాబాద్, వెలుగు : 'అబ్ కి బార్ 400 పార్' అని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఎన్నికల్లో 270 సీట్లు రావడం కష్టమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా అన్నారు. ఒకవైపు ఇండియా కూటమి బలపడుతోందని, మరోవైపు బీజేపీ సిట్టింగ్ స్థానాలను కోల్పోయే పరిస్థితులు కన్పిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో 400లకు పైగా సీట్లు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని మగ్దూంభవన్ లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ..మరోసారి బీజేపీ అధికారంలోనికి వస్తే రాజ్యాంగాన్ని
పౌరహక్కులను రద్దు చేస్తుందని, ఫాసిజాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో గుజరాత్ లో 26 స్థానాలను బీజేపీ గెలుచుకున్నదని, ఈ సారి అక్కడ ఇండియా కూటమి బలపడిందన్నారు. రాజస్థాన్ లో నాలుగైదు , బీహార్ లో పదిస్థానాలు..ఇలా చాలా రాష్ర్టాల్లో సిట్టింగ్ స్థానాలు కోల్పోయే పరిస్థితులున్నాయని వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సీపీఐ 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తుందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని
తెలిపారు. తెలంగాణలో పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్ లోక్ సభ స్థానాల్లో ఏదైనా ఒక సీటు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు గుర్తుచేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.